డబ్బు ముట్టజెప్పే విషయమై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో వాట్సప్ చాటింగ్ జరిగిందని పేర్కొంటూ పలు వాట్సప్ స్క్రీన్ షాట్లు సుఖేష్ చంద్రశేఖర్ బయటపెట్టారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇదో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. అసలు సుఖేష్ చంద్రశేఖర్ ఎవరో తనకు తెలియదని స్పష్టం చేశారు.నకిలీ చాట్ లతో తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేకనే తనపై ఇలా దాడికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయన్నారు.
బీఆర్ఎస్ కి ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఓ ఆర్థిక మోసగాడు అనామక లేఖ రాస్తే అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, ఆ లేఖను పట్టుకొని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ ఈసీకి లేఖ రాశారన్నారు. బీజేపీ టూల్ కిట్ లో భాగమే ఈ బురదచల్లే కార్యక్రమమని కవిత మండిపడ్డారు. ఇప్పుడు క్రిమినల్ సుఖేష్ ను పావుగా వాడుకొని తెలంగాణ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ కుటుంబ సభ్యులను బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. పాత్రికేయులు కనీస విలువలు పాటించకపోవడం అత్యంత బాధాకరమన్నారు. రాజకీయ ఎజెండాలో మీడియా సంస్థలు కూడా పావుగా మార దురదృష్టకరమన్నారు.
నీలాండరింగ్ కేసులో జైల్లో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్.. వాట్సాప్ చాట్ ను బయటపెట్టాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో చేసిన చాటింగ్ అంటూ స్క్రీన్ షాట్లు బయటపెట్టాడు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే, ఈ చాట్ తెలుగులో ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో ఉన్న కోడ్ నేమ్స్ కూడా అందులో మెన్షన్ చేశాడు. అందులో కవిత అక్క, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పేరు పేర్కొన్నాడు. 15 కేజీల ఘీ(నెయ్యి) అంటే రూ.15 కోట్లు, 25 కేజీల నెయ్యి అంటే రూ.25 కోట్లు.. ఇలా కోడ్ నేమ్స్ సైతం అందులో ప్రస్తావించాడు. ఏకేజీ అంటే.. అరవింద్ కేజ్రీవాల్ జీ, ఏపీ అంటే అరుణ్ పిళ్లై అనే కోడ్ నేమ్స్ అందులో ప్రస్తావించాడు.