ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ విచారణ తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మొదటి సారిగా స్పందించారు. సీబీఐ దాడులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ఎన్ని అడ్డంకులు చేసినా… ముందుకే వెళ్తామని, ఈ పోరాటంలో విశ్రాంతి తీసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఎవరు మాట్లాడితే వారిపైకి సీబీఐ వస్తోందని, దేశ వ్యాప్తంగా ఇదే తంతు కొనసాగుతోందని మండిపడ్డారు. తెలంగాణ జాగృతి రాష్ట్ర స్థాయి సమావేశంలో కవిత ప్రసంగించారు. దేశంలో ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన ప్రభుత్వాలను బీజేపీ కూల్చేస్తోందని ఆరోపించారు.
దేశంలోని అనేక అంశాల పట్ల ప్రజలను జాగృతం చేయాల్సిన బాధ్యత జాగృతి సభ్యులపై వుందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తోందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడగలిగితేనే అది మనల్ని కాపాడుతుందన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎవరు ప్రశ్నించినా.. ఏజెన్సీలతో దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు.