ఎట్టకేలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. సుమారు 6 గంటల పాటు ఈడీ ఆయన్ను ప్రశ్నిచింది. అయితే… తనని ఏ కేసులో విచారణ జరుపుతున్నారో తనకు తెలియడం లేదని, కేవలం విచారణకు సహకరించాలని మాత్రమే చెబుతున్నారని అన్నారు. వ్యాపార లావాదేవీలను అడిగి తెలుసుకున్నారని, మనీలాండరింగ్ వివరాలను మాత్రం అడగలేదని ఎమ్మెల్యే వెల్లడించారు. మంగళవారం మళ్లీ ఉదయం 10:30 కల్లా విచారణకు రావాలని ఎమ్మెల్యేను అధికారులు ఆదేశించారు. వ్యక్తిగత వివరాలు, ఆర్థిక లావాదేవీలు, ఆస్తులకు సంబంధించిన వివరాలతో విచారణకు రావాలని, తామిచ్చిన ఫార్మెట్ లోనే వివరాలు ఇవ్వాలి ఈడీ సూచించింది.
అంతకు ముందు ట్విస్టుల మీద ట్విస్టులు నడిచాయి. షెడ్యూల్ ప్రకారం ఈడీ ఎమ్మెల్యే రోహిత్ ను 19న విచారణకు రావాలని నోటీసులిచ్చింది. అందుకు రోహిత్ రెడ్డి కూడా అంగీకరించారు. సోమవారం విచారణకు అని బయల్దేరి… ప్రగతి భవన్ కి వెళ్లి… సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత తాను విచారణకు హాజరవ్వడం లేదని ట్విస్ట్ ఇచ్చారు. ప్రస్తుతం అయ్యప్ప మాలలో వున్నానని, విచారణకు హాజరు కాలేనంటూ తన పీఏ ద్వారా ఈడీకి లెటర్ పంపించారు. వ్యక్తిగత కారణాలు, అయ్యప్ప మాలలో ఉన్నందున ఈ నెల 25 తర్వాత విచారణకు వస్తానని చెప్పినట్టు సమాచారం.
ఈడీ అధికారులు రోహిత్ రెడ్డి ప్రపోజల్ ను పక్కన పెట్టారు. షెడ్యూల్ ప్రకారం ఎంక్వైరీకి రావాల్సిందే అని చెప్పారు. దీంతో సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి బషీర్ బాగ్ లోని ఈడీ ఆఫీస్ కు మధ్యాహ్నం మూడున్నరకు వెళ్లారు. ఆస్తి పత్రాలు, అందుబాటులో ఉన్న బ్యాంక్ స్టేట్ మెంట్లు తీసుకెళ్లారు.