కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మళ్లీ వార్తల్లో నిలిచారు. ఈసారి ఏకంగా సంచలన ప్రకటనే చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను సంగారెడ్డి నుంచి బరిలోకి దిగడం లేదని ప్రకటించారు. సంగారెడ్డి టిక్కెట్ కాంగ్రెస్ కార్యకర్తకే నని ప్రకటించారు. అయితే.. ఒకవేళ కార్యకర్తలు వద్దన్న పక్షంలో తన భార్య నిర్మలను బరిలోకి దింపుతామని సంచలన ప్రకటన చేశారు. అయితే… మళ్లీ 2028 నాటి ఎన్నికల్లో బరిలోకి దిగుతానని ప్రకటించారు. ఇదంతా రాజకీయ వ్యూహంలో భాగమేనని, దీని వెనుక ఎవ్వరి ఒత్తిళ్లూ లేవని స్పష్టం చేశారు. తాను ఒక టర్మ్ ఎలక్షన్స్ లో పోటీ చేయకుండా ఎందుకు దూరంగా ఉన్నాననే విషయం తర్వాత అందరికీ తెలుస్తుందని చెప్పారు. అయితే దీనిపై తెలంగాణ పీసీసీ ఇంకా స్పందించలేదు.

 

కొన్ని రోజులుగా పీసీసీకి, జగ్గారెడ్డికి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. పీసీసీ కార్యాలయానికి కూడా దూరంగా వుంటూ వస్తున్నారు. తాను కాంగ్రెస్ విడిచి వెళ్తానని కొన్ని రోజుల క్రిందటే సంచలన ప్రకటన చేశారు. దీంతో అప్పట్లో ఈ వార్త బాగా సంచలనం అయ్యింది. ఆ తర్వాత అధిష్ఠానం జరిపిన చర్చలతో జగ్గారెడ్డి దిగొచ్చారు. కొన్ని రోజుల పాటు తాను ఈ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటానని, అధిష్ఠానం చెప్పడంతోనే ఈ నిర్ణయానికి వచ్చానని జగ్గారెడ్డి ప్రకటించారు.