బీజేపీ ఎంపీ అర్వింద్ పై మంత్రి ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. అర్వింద్ పై ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను తాను పూర్తిగా సమర్థిస్తున్నానని ప్రకటించారు. అర్వింద్ వ్యవహరించే తీరుకు ఎమ్మెల్సీ కవిత తిట్టిన తిట్లు తక్కువేనని, ఎందరు ఎన్ని తిట్లు తిట్టినా… అర్వింద్ తీరు మార్చుకోలేదని మండిపడ్డారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి నేడు తెలంగాణ భవన్ లో మాట్లాడారు. అర్వింద్ అంటేనే నిలువెత్తు అబద్ధమని, అబద్ధాల పుట్ట అని మంత్రి అన్నారు. అర్వింద్ రాజకీయాలకే ఓ కళంకమని మండిపడ్డారు. పసుపు బోర్డు విషయంలో బాండ్ పేపర్ పై రాసిచ్చి, మాట తప్పిన ఏకైక నాయకుడు అర్విందే అని మంత్రి ఎద్దేవా చేశారు.
అర్వింద్ చేసిన ఆరోపణలపై మహిళ అయిన గవర్నర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడు అయ్యాకే రాజకీయాల స్థాయి దిగజారిందని, తిట్లు తిడితేనే వార్తకు ప్రాముఖ్యత వస్తుండడం దురదృష్టకరమన్నారు. సక్సెస్, ఫెయిల్యూర్ అంటే ఎంటో బండి సంజయ్‌కి తెలుసా? అని మండిపడ్డారు. పీఎం మోడీ ఓ ఫెయిల్యూర్ ప్రధాన మంత్రి అని, కేసీఆర్ ఏ అంశాల్లో సఫలం అయ్యారో అవే అంశాల్లో మోదీ విఫలమయ్యారన్నారు. జీడీపీ, జాతీయ తలసరి ఆదాయంలో మోదీ దేశాన్ని దిగజార్చారని ఆరోపించారు. ఎపుడు ఎన్నికలు వస్తాయో ప్రజలు ఎదురు చూస్తున్నారని బండి సంజయ్ అంటున్నారని, మునుగోడులో ఓటమి పాలైనా బీజేపీ బుద్ధి మారడం లేదన్నారు.