తెలంగాణ భవన్ లో నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నగరానికి చెందిన మంత్రులు అత్యవసరంగా భేటీ అయ్యారు. మంత్రి మల్లారెడ్డి, ఆయన సోదరులు, అల్లుళ్ల ఇంటిపై ఐటీ దాడులు నిర్వహించిన నేపథ్యంలో ఈ అంశమే ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే చీకోటి ప్రవీణ్ కేసినో కేసు వ్యవహారంలో మంత్రి తలసాని సోదరులను, పీఏ హరీశ్ ను, ఎమ్మెల్సీ ఎల్. రమణను ఈడీ విచారించింది. ఈ అంశాన్ని కూడా వారు చర్చించినట్లు సమాచారం. ఇలాంటి క్లిష్ట సమయంలో ఏం చేయాలన్న దానిపై సమాలోచన జరిపినట్లు తెలుస్తోంది.
ఇక… ఈ సమావేశం ముగిసిన తర్వాత మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. ఈ నెల 27 నుంచి 15 నియోజకవర్గాల పరిధిలోని ప్రజాప్రతినిధుల సమావేశం తెలంగాణ భవన్ లో నిర్వహిస్తామని, అందుకే ఈ సమావేశం నిర్వహించామని వెల్లడించారు. అయితే… తెలంగాణలో జరుగుతున్న ఈడీ,ఐటీ దాడులపై కూడా ఘాటుగానే స్పందించారు. వ్యవస్థలు వారి చేతుల్లో వున్నాయనే ఇలా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. రేపు తమ చేతుల్లోకి కూడా వ్యవస్థలు రావొచ్చని, టార్గెట్ గానే దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రొటీన్ గా దాడులు జరిగితే పట్టించుకోమని, కానీ… టార్గెట్ గానే దాడులు జరుగుతున్నాయని అన్నారు. అన్నింటినీ సమర్థవంతంగానే ఎదుర్కొంటామని తలసాని ప్రకటించారు.