కడపలో స్టీల్ ప్లాంట్ ప్రారంభానికి జగన్మోహన్ రెడ్డికి కేంద్రం అనుమతి ఇచ్చిందని, మా సెక్రటేరియట్ ప్రారంభానికి ఇవ్వలేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వ్యవస్థను ఎలా నడుపుతోందో దేశం అంతా గమనిస్తోందన్నారు. సెక్రెటేరియట్‌ కట్టడం చూసి కొంతమంది ఓర్వలేకపోతున్నారన్నారు. సెక్రెటేరియట్‌ కట్టడం గొప్పతనం భవిష్యత్‌లో అందరికీ తెలుస్తుందన్నారు. తెలంగాణ భవన్ లో మంత్రి తలసాని విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై స్పందించారు.

వచ్చే ఎన్నికల్లో హంగ్ వస్తుందని, బీఆర్ఎస్, కాంగ్రెస్ కలవాల్సిందేనంటూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమ్ము దుమారం రేపుతున్నాయి. అటు సొంత పార్టీలోనూ, అటు బీఆర్ఎస్ లోనూ కాక రేపుతున్నాయి. ఎంపీ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘాటుగా స్పందించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గంటకో మాట మాట్లాడుతున్నారని, మాటల్లో విశ్వసనీయత లేదన్నారు.

 

వెంకటరెడ్డి పొద్దున ఒక మాట.. సాయంత్రం మరో మాట మాట్లాడుతున్నారని, కాంగ్రెస్‌తో పొత్తు అనే మాటే లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ బలమైన, తెలంగాణ ప్రజల పార్టీ అన్నారు. BRS ఏ రాజకీయ పార్టీపై ఆధారపడదన్నారు. పోయి పోయి.. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటామా? పొత్తుతో ఏం అవసరం వుంది? అని ప్రశ్నించారు. తమతో పోటీ పడే వారు తెలంగాణలో లేరని స్పష్టం చేశారు. వామపక్షాలతో పొత్తుపై మాత్రం కేసీఆరే మాట్లాడతారని అన్నారు.