హైదరాబాద్ వేదికగా భారత్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న క్రికెట్ మ్యాచ్ టికెట్లు బ్లాక్ చేశారన్న వార్తలపై హెచ్సీఏపై తెలంగాణ క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా మండిపడ్డారు. మ్యాచ్ టిక్కెట్ల అవకతవకలపై విచారణ జరుపుతామని, ఒకవేళ టిక్కెట్లు బ్లాక్ లో అమ్మినట్లు తేలితే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వుంటుందని హెచ్సీఏకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ అసోసియేషన్ వున్నది కేవలం 10 మంది కోసం కాదని, ఉప్పల్ స్టేడియం కోసం ప్రభుత్వం 23 ఎకరాలు ఇచ్చిందన్న విషయాన్ని గమనంలోకి తీసుకోవాలని తేల్చి చెప్పారు.

 

తెలంగాణ ప్రతిష్ఠను దిగజార్చేలా చేస్తే… సహించమని తేల్చి చెప్పారు. బ్లాక్లో టికెట్లు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని టికెట్లు ఆన్లైన్లో అమ్మాల్సిందేనన్న ఆయన.. స్టేడియం కెపాసిటీ ఎంత..? టికెట్లు ఎలా అమ్మారన్న విషయంపై ఆరా తీస్తామన్నారు. హెచ్ సీఏ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. టికెట్ల అంశంపై క్రీడా సంస్థ, పోలీసుల నిఘా ఉందని చెప్పారు.