కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే హైదరాబాద్ లో శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయని కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి అన్నారు. బీజేపీ అనేది ముస్లింలకు వ్యతిరేకం కాదని, ఒకవేళ అదే నిజమైతే… కలాంను రాష్ట్రపతి చేస్తామా? అంటూ సూటిగా ప్రశ్నించారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ పెద్ద అంబర్ పేటలో జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంా ఆమె మాట్లాడుతూ… యూపీలో ప్రజాధనాన్ని దోచుకున్న వారి ఇండ్లను సీఎం యోగి బుల్డోజర్లతో కూలగొట్టారని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే అదే పని చేస్తామని ప్రకటించారు.
హైదరాబాద్ లో మత మార్పిడులు జరుగుతున్నాయని, ఒవైసీ లాంటి విష పాములు దేశ సంస్కృతిని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. తాము మతతత్వమని విమర్శించే వారు, ఎంఐఎంతో దోస్తానా చేస్తున్న టీఆర్ఎస్ ను ఎందుకు విమర్శించరని ఆమె ప్రశ్నించారు. మోదీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వున్న కుటుంబ పార్టీ ఒక్కటవుతున్నాయని, అయినా తమకు ఇబ్బంది లేదన్నారు.కేసీఆర్ ధోకాబాజీ సీఎం అని నిరంజన్ సాధ్వీ అభివర్ణించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ఇంటిని కూడా నిర్మించలేదని, పేదల మరుగుదొడ్లకు ఇచ్చిన డబ్బులను కూడా కేసీఆర్ దుర్వినియోగం చేశారని ఆమె ఆరోపించారు.