తెలంగాణ ఆర్టీసీ కొత్త బస్సులొచ్చేశాయి. రవాణా మంత్రి అజయ్ కుమార్ శనివారం వాటిని జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో 50 సూపర్ లగ్జరీ బస్సులు వున్నాయి. 392 కోట్లతో అధునాతన 1,016 కొత్త బస్సులను కొనుగోలు చేయాలని సంస్థ నిర్ణయించింది. మొదటి విడతలో 630 సూపర్ లగ్జరీలు, 130 డీలక్స్, 16 స్లీపర్ బస్సులను కొనుగోలు చేసింది. ఈ బస్సులను 2023 మార్చి నాటికి అందుబాటులోకి తేనుంది సంస్థ. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ.. తొలి విడత కొనుగోలు చేస్తున్న 760 పైగా బస్సుల్లో నేడు 50 బస్సులను మాత్రమే ప్రారంభించామని, వచ్చే మార్చి లోపల అన్ని బస్సులను అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. కరోనా కారణంగా ఆర్టీసీ దాదాపు 2 వేల కోట్లను నష్టపోయిందన్నారు. ఆ నష్టాన్ని పూడ్చే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి, ఎండీ సజ్జనార్, అధికారులు పాల్గొన్నారు.