కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్వహిస్తున్న పరీక్షను తెలుగు సహా అన్ని ప్రాంతీయ భాషల్లోనూ రాసే అవకాశం కల్పించాలని మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి లేఖ రాశారు. ఇటీవల విడుదల చేసిన సీఇఆర్పీఎఫ్ ఉద్యోగాల భర్తీ ప్రకటనలో కేవలం ఆంగ్ల, హిందీ మాధ్యమంలోనే పరీక్ష రాయడానికి అవకాశం కల్పించడంపై కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వివక్ష ఏర్పడుతుందని, ఆంగ్లం, హిందీ ప్రాంతాలకు చెందని నిరుద్యోగ యువకులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందన్నారు. సీఆర్పీఎఫ్‌ ఉద్యోగాల కోసం హిందీ, ఇంగ్లిష్‌లో మాత్రమే పరీక్షలు నిర్వహించాలన్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరారు. ఈ పరీక్షను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతోపాటు అన్ని అధికారిక భాషల్లో నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

 

అనేక అధికారిక భాషలున్న భారతదేశంలో హిందీవారికి మాత్రమే పోటీ పరీక్షలు రాసే అవకాశం ఇవ్వడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. దేశంలో రాజ భాష అంటూ ఏదీలేదని రాజ్యాంగం స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ప్రాంతీయ భాషలను పట్టించుకోకుండా హిందీ, ఆంగ్ల మాధ్యమాల్లోనే ఉద్యోగ పరీక్షలు నిర్వహించడం దారుణమని మండిపడ్డారు. సమాన అవకాశాలు పొందేలా ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన హకును సీఆర్పీఎఫ్‌ నోటిఫికేషన్‌ కాలరాస్తున్నదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలను రాజ్యాంగం గుర్తించిన అన్ని అధికారిక భాషల్లోనూ నిర్వహించాలని 2020 నవంబర్‌ 18న కేంద్ర ప్రభుత్వానికి సీఎం కేసీఆర్‌ లేఖ కూడా రాశారని గుర్తుచేశారు.