రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనవెల్లిలో త్వరలోనే ఐటీ సెంటర్ ను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ మంత్రి కె. తారక రామారావు ప్రకటించారు.దీంతో 1,200 మందికి ఉద్యోగాలు లభిస్తాయని ప్రకటించారు. చందనవెల్లిలో వెల్ స్పన్ పరిశ్రమ రెండో యూనిట్ ను ప్రారంభించారు. వెల్ స్పన్ చైర్మన్ బీకే గోయెంకాతో కలిసి కంపెనీలో తిరిగారు. మూడేండ్ల క్రితం ఈ ప్రాంతంలో ఏమీ లేదని, ప్రస్తుతం పరిశ్రమలు పెట్టేందుకు పొరుగు రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి అనేక సంస్థలు వస్తున్నాయని తెలిపారు. భవిష్యత్తుతో షాబాద్‌ పరిధిలోని చందన్‌వెల్లి ప్రాంతం అతిపెద్ద పారిశ్రామిక సమూహంగా అవతరిస్తుందని తెలిపారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతులకు ముగ్ధులై పొరుగు రాష్ట్రాలలో  ఏర్పాటు కావాల్సిన కంపెనీలు కూడా ఇక్కడికి తరలి వస్తున్నాయని చెప్పారు. గుజరాత్‌లో ఏర్పాటు కావాల్సిన ‘వెల్‌స్పన్‌’ కంపెనీ తెలంగాణకు రావటమే అందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు.

శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి చందన్‌వెల్లికి నాలుగు లైన్ల రహదారి మంజూరైనట్టు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రూ.100 కోట్ల టీఎస్‌ఐఐసీ నిధులతో ఈ రహదారిని నిర్మించనున్నట్టు చెప్పారు. వెల్‌స్పన్‌ కంపెనీకి స్థానికులు, ప్రజాప్రతినిధులు తోడ్పాటు అందించాలని కోరారు. భారీ కంపెనీల స్థాపనతో ఈ ప్రాంతంలో భవిష్యత్తులో మహిళలు, యువతకు వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెప్పారు.

 

త్వరలోనే చందన్‌వెల్లి ‘వెల్‌స్పన్‌’ వ్యాలీ అయ్యే అవకాశాలున్నాయని అన్నారు. వ్యవసాయంలోనూ అద్భుతంగా రాణిస్తున్న ఈ ప్రాంతానికి త్వరలోనే పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా కృష్ణా నీటిని తీసుకొస్తామని తెలిపారు. షాబాద్‌, చందన్‌వెల్లి, సీతారాంపూర్‌ ప్రాంతంలో పారిశ్రామికంగా వేగంగా మార్పులు వస్తున్నాయని, త్వరలో మరిన్ని మార్పులు వచ్చే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. వెల్‌స్పన్‌ అధినేత బాలక్రిషన్‌ తెలంగాణకు అతిపెద్ద అంబాసిడర్‌గా మారనున్నారని తెలిపారు.