ఖమ్మం జిల్లా చీమలపాడు అగ్నిప్రమాద బాధితులనుమంత్రి కేటీఆర్‌ పరామర్శించారు. గ్యాస్‌ సిలిండర్‌ పేలిన ఘటనలో తీవ్రంగా గాయపడిన నలుగురు బాధితులు హైదరాబాద్‌లోని నిమ్స్‌ లో చికిత్స పొందుతున్నారు. గురువారం ఉదయం మంత్రి పువ్వాడ అజయ్‌, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్రతో కలిసి బాధితులను పరామర్శించారు. నలుగురి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అయితే ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు మంత్రి కేటీఆర్‌కు తెలిపారు.

బాధితులకు మెరుగైన వైద్యసాయం అందించాలని వైద్యులకు సూచించారు. చీమలపాడు ఘటన దురదృష్టకరమని చెప్పారు. ప్రమాదంలో కుట్ర కోణం ఉందో.. లేదో దర్యాప్తులో తేలుతుందన్నారు. ఇప్పటికే మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించామని చెప్పారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని వైదులను కోరినట్లు తెలిపారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలకు తాము అండగా ఉంటామన్నారు.

 

ఖమ్మం జిల్లాలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి, 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. నలుగురు మరణించారు.  ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన నేతలను ఆహ్వానించడానికి స్థానిక కార్యకర్తలు బాణాసంచా పేల్చారు. దీంతో పక్కనే వంటల కోసం ఏర్పాటు చేసిన గుడిసెలో వున్న సిలిండర్ పై నిప్పు రవ్వలు పడ్డాయి. దీంతో సిలిండర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో ఒకరు మృతి చెందగా..10 మందికి గాయాలయ్యాయి. వీరిలో కొంత మంది పరిస్థితి విషమంగా వుందని, గాయపడ్డ వారిలో ఇద్దరు పోలీసులు, మరో ఇద్దరు పాత్రికేయులు కూడా వున్నారు. క్షతగాత్రులను పోలీసుల వాహనాల్లో ఖమ్మం తరలించారు. ఈ ఘటన జరగడంతో ఆత్మీయ సమ్మేళనం రద్దైంది. నాయకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.