కేంద్రంపై తెలంగాణ ఐటీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. కేంద్రం ఏం చేసినా తెలంగాణ అభివృద్ధిని ఆపలేరని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రగతికి కేంద్రం కొన్ని ఆటంకాలు కలిగించవచ్చు. కానీ అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రయాణాన్ని మాత్రం అడ్డుకోలేరని మంత్రి స్పష్టం చేశారు. ఐటీఐఆర్ రద్దు చేసినా… తెలంగాణ ఐటీ రంగం గత 8 సంవత్సరాల్లో 3.2 రెట్లు డెవలప్ అయ్యిందన్నారు.
సకాలంలో నిధులు ఇవ్వకపోయినా, ఎఫ్ ఆర్ బీఎం ఆంక్షలు విధించినా… దేశంలో 2.5 శాతం జనాభా వున్న తెలంగాణ వాటా జీడీపీలో 5 శాతంగా వుందని తెలిపారు. తలసరి ఆదాయం కూడా దాదాపుగా రెట్టింపు అయ్యిందని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ప్రతికూల పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో తెలంగాణ ప్రజలకు తెలుసని, వాటిని సాకారం చేసుకోవడం కూడా తెలుసని కేటీఆర్ స్పష్టం చేశారు.