మంత్రి కేటీఆర్ మళ్లీ ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. 2014 లో మోదీ ప్రధాని అయినప్పుడు క్రూడాయిల్ ధర 94 డాలర్లు, ఈ రోజు క్రూడాయిల్ ధర 98 డాలర్లుగా వుందని పెద్ద తేడాలేదన్నారు. అయినా… లీటరు పెట్రోల్ ధర 70 రూపాయలుండగా… నేడు లీటర్ 112 కి చేరుకుందన్నారు. పెట్రోలు రేటు ఎందుకు పెరుగుతోందని ప్రశ్నించారు. రాష్ట్రాలేమైనా పన్నులు పెంచాయా? ముడి చమురు ధర పెరగలేదు కానీ.. మోడీ చమురు ధర పెరుగుతోందని ఎద్దేవా చేశారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో ఏర్పాటు చేసిన లారీ యజమానులు, డ్రైవర్ల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం స్పందించింది, పెట్రోల్ డీజిల్ పై విధించిన సెస్సు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లీటర్ పెట్రోల్ 70, డీజిల్ 65 రూపాయలకే ఇవ్వాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫ్లోరోసిస్ ను తరిమికొట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుని.. నాలుగేళ్లలో ఫ్లోరోసిస్ ను పూర్తిగా నయం చేశారని చెప్పారు. మిషన్ కాకతీయతో చెరువులు బాగు చేసుకున్నామన్నారు. తెలంగాణ రాకముందు కరెంటు ఉంటే వార్త అని, ఇప్పుడు 15 నిమిషాల పాటు కరెంటు పోతే వార్త అవుతోందన్నారు. రాష్ట్రంలోని అన్ని సెక్టార్లకు కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒకప్పుడు ఫ్లోరోసిస్ వ్యాధితో ప్రజలు జీవచ్చవాలుగా మారిపోయారని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజలు ఫ్లోరోసిస్ వ్యాధితో బాధపడుతుంటే కేసీఆర్ తట్టుకోలేకపోయారని అన్నారు.