తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంత్రి కేటీఆర్, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మధ్య వాగ్వాదం జరిగింది. సింగరేణి, గనుల కేటాయింపు విషయంపై ఎమ్మెల్యే ఈటల అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. తమ ప్రభుత్వం ఒకరి కోసమో, లేదా స్నేహితుల కోసమో పనిచేసే ప్రభుత్వం కాదని అన్నారు. తాము పరిశ్రమలకు అనుకూల రాష్ట్రమే తప్ప, పారిశ్రామికవేత్తకు అనుకూల రాష్ట్రం కాదని కౌంటర్ ఇచ్చారు. కేంద్రం రాష్ట్రాలు, డిస్కంలకు ఉత్తరాలు రాసి దేశీయ బొగ్గును కొనవద్దని చెప్పిందని, 25శాతం ఖర్చయితే మాత్రం కూడా దాన్ని పక్కనబెట్టి విదేశాల నుంచి ఖచ్చితంగా దిగుమతి చేసుకోవాలని, నాలుగు రెట్లు విలువైన బొగ్గును దిగుమతి చేసుకోవాలని సూచించిందని గుర్తు చేశారు. ఎవరి కోసం ? ఎవరి ప్రయోజనం కోసం చేసింది చెప్పాలని మంత్రి కేటీఆర్ నిలదీశారు.
ప్రధాని మోదీ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లగానే.. ఆయన స్నేహితునికి పెద్ద బొగ్గు గని రెండునెలల్లోనే వస్తుందని, ఇండోనేషియాకు ప్రధాని పోగానే.. నెల రోజుల్లోనే మళ్లీ దోస్తుపోగానే బొగ్గు గనులు వస్తాయని విమర్శించారు. ఇవాళ దేశంలో ఏం జరుగుతుందో వారి మనసుకు కూడా తెలుసని, ఒకరి కోసం పని చేసే ప్రభుత్వం ఇక్కడ లేదని, బొగ్గు గనుల కోసం ఆవేదన చెబుతున్నారు.
కేంద్రం ఆధీనంలోని కోల్ ఇండియా కంటే సింగరేణి మెరుగైన ఫలితాలు సాధిస్తున్న మాట వాస్తవం కాదా?.. అంటూ నిలదీశారు. సింగరేణి ఆధ్వర్యంలో పని చేస్తున్న జెన్‌కో, బొగ్గు ఉత్పత్తి కేంద్రాలు 91.6 శాతం పీఎల్‌ఎఫ్‌తో భారతదేశంలో ప్రైవేటు విద్యుత్ కేంద్రాలు, కోల్ ఇండియా సంస్థల కంటే అత్యధిక పీఎల్‌ఎఫ్ సాధిస్తూ వరుసగా ఆరుసార్లు అవార్డు సాధించడం వాస్తం కాదా? అని కేటీఆర్ ప్రశ్నించారు.
సింగరేణిని ప్రైవేటుపరం చేసే ఆలోచన కేంద్రానికి లేదని ఈటల రాజేందర్ చెబుతున్నారని, స్వయంగా మోదీయే ఈ విషయాన్ని చెప్పారని అంటున్నారని కేటీఆర్ అన్నారు. విశాఖ ఉక్కును అమ్మాలని చూస్తోంది ఎవరని కేటీఆర్ ప్రశ్నించారు. ఏ కారణం చేత విశాఖ ఉక్కును అమ్మాల్సి వస్తుందో చెప్పాలని నిలదీశారు. అదే వ్యూహాన్ని సింగరేణి విషయంలోనూ కేంద్రం అనుసరించే ప్రయత్నం చేస్తోందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఈటలకు చిత్తశుద్ధి వుంటే… సింగరేణికి ఎందుకు గనులు కేటాయించలేదో కేంద్రాన్ని నిలదీయాలని కేటీఆర్ సవాల్ విసిరారు.