మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అద్భుతమైన మెజార్టీతో గెలువబోతున్నదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు తేల్చిచెప్పారు. ఉప ఎన్నికలో తెలంగాణ ప్రగతికి, పురోగతికి మునుగోడు ఓటర్లు పట్టం కడుతారని పేర్కొన్నారు. తెలంగాణ భవన్ లో కేటీఆర్ మంగళవారం విలేకరులతో మాట్లాడారు. నీళ్లిచ్చిన పార్టీ, కన్నీళ్లిచ్చిన పార్టీకి మధ్య తేడాను మునుగోడు ప్రజలు గమనించాలని కోరారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ శ్రేణులు భౌతిక దాడులకు దిగుతున్నాయని మండిపడ్డారు. ఓడిపోతామన్న భయంతోనే పలివెలలో బీజేపీ ఈ పని చేసిందని ఎద్దేవా చేశారు. శాబ్దాలుగా ఫ్లోరైడ్ సమస్యతో బాధపడ్డ మునుగోడు ప్రజలకు బాసటగా నిలబడి, మునుగోడులోనే పైలాన్ ఆవిష్కరించి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి.. ఫ్లోరోసిస్ భూతాన్ని తరిమేసింది కేసీఆర్’ అని తెలిపారు.
మునుగోడును రాజగోపాల్రెడ్డి పట్టించుకోకపోయినా, అనాథలా వదిలిపెట్టినా.. అభివృద్ధి, సంక్షేమం ఆగలేదని మం త్రి కేటీఆర్ తెలిపారు. రైతులకు 24 గంటల విద్యుత్తు, 79 వేలమందికి రైతుబంధు, 1189 మందికి రైతుబీమా అందిందని, చర్లగూడెం, శివన్నగూడెం, లక్ష్మణాపూర్ ప్రాజెక్టులు శరవేగంగా పూర్తవుతున్నాయని వివరించారు. ప్రధా ని మోదీ కృష్ణా జలాలను తెలంగాణకు కేటాయించి ఉంటే ఇప్పటికే ఆ ప్రాజెక్టులు పూర్తయ్యేవని వెల్లడించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ఇంటింటికీ అందుతున్నాయని చెప్పారు. తాము చేసిన పనులను వివరిస్తూ పాజిటివ్ ఓటు అడుగుతున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. మునుగోడు ప్రజల చిరకాల వాంఛ అయిన చౌటుప్పల్, చండూరు మున్సిపాలిటీలు, గట్టుప్పల్ మండలం కావాలన్న కోరికలను కేసీఆర్ ప్రభుత్వం నెరవేర్చిందని, త్వరలో చండూరును రెవెన్యూ డివిజన్ చేస్తామని ప్రకటించారు. గిరిజన సోదరులకోసం నియోజకవర్గంలోని 62 తండాలలో 21 తండాలను గ్రామపంచాయతీలుగా మార్చామని గుర్తుచేశారు.