మునుగోడు రిటర్నింగ్ అధికారి బదిలీ విషయంలో మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరు తీవ్ర ఆక్షేపణీయమని అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ ఎలా దుర్వినియోగం చేస్తుందో వివరించేందుకు ఇదో ఉదాహరణ అని మండిపడ్డారు. 2011లోనే సస్పెండ్ చేసిన రొడ్డు రోలర్ గుర్తును తిరిగి పెట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని అపహాస్యం చేయడమేనని అన్నారు. గతంలో తమ అభ్యర్ధన మేరకు రోడ్డు రోలర్ గుర్తును తొలగించి, మరోసారి తిరిగి ఈ ఎన్నికల్లో రోడ్డు రోలర్ ను తేవడం ఎన్నికల స్ఫూర్తికి విరుద్ధమని మండిపడ్డారు.

 

 

తమ పార్టీ కారు గుర్తును పోలిన గుర్తులతో అయోమయానికి గురిచేసి దొడ్డిదారిన ఓట్లు పొందే కుటిల ప్రయత్నాన్ని బీజేపీ చేస్తుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలన్న రాజ్యంగ స్ఫూర్తికి ఇది విఘాతం కలిగిస్తుందని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగబద్ధ సంస్థలను తన స్వప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడాన్ని ప్రజలు గమనించాలని మంత్రి కేటీఆర్ కోరారు.