తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ముంబైలో పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. ఇందులో భాగంగా టాటా గ్రూప్‌ చైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌తో టాటా కార్పొరేట్‌ కేంద్ర కార్యాలయం-బాంబే హౌస్‌లో సమావేశమై వివిధ వ్యాపార వాణిజ్య అవకాశాలపై చర్చించారు. ప్రగతిశీల విధానాలతో పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టిస్తున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కేటీఆర్ ఈ సందర్భంగా వారిని కోరారు. ఆయా రంగాలవారీగా టాటా గ్రూప్‌ కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు ఉన్న అవకాశాలను వివరించి, మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కోరారు. వ్యాపార విస్తరణ ప్రణాళికలో తెలంగాణకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రశేఖరన్‌కు విన్నవించారు. తెలంగాణలో వ్యాపార నిర్వహణ అత్యంత సులువు అని, భవిష్యత్తులో టాటా కార్యకలాపాల విస్తరణలో రాష్ట్రానికి కీలక స్థానం కల్పిస్తామని టాటా గ్రూప్‌ చైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌ మంత్రి కేటీఆర్ కి హామీ ఇచ్చారు.

మరో ప్రముఖ పారిశ్రామిక సంస్థ జేఎస్‌డబ్ల్యూ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సజ్జన్‌ జిందాల్‌తో ఆ సంస్థ కేంద్ర కార్యాలయంలో మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు. జేఎస్‌డబ్ల్యూ సంస్థకు స్టీల్‌, సిమెంట్‌ వంటి రంగాల్లో ఉన్న అనుభవం దృష్ట్యా ఆ రంగంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని జిందాల్‌ను కోరారు. తెలంగాణ ఏర్పడినప్పుడు బయ్యారంలో స్టీల్‌ ప్లాంట్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు కేంద్రం ముందుకు వచ్చిందని, అకడ ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు సెయిల్‌ సంసిద్ధత వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తుచేశారు.

ఇక… మరో పారిశ్రామికవేత్త హిందుస్థాన్‌ యూనిలివర్‌ లిమిటెడ్‌ (హెచ్‌యూఎల్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజీవ్‌ మెహతాతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయంతో పాటు అనేక ఇతర ఆర్థిక సూచీలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, ఆయా రంగాల్లో ప్రజల కొనుగోలు శక్తి పెరిగిన నేపథ్యంలో తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా ఎంచుకునేందుకు ఇదే సరైన అవకాశమని తెలిపారు.