తెలంగాణ కూల్ రూఫ్ విధానం 2023-28 ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం వల్ల ఇళ్లు, కార్యాలయాలు, వాణిజ్య భవనాలపై ఉష్ణోగ్రతలను తగ్గించేందుకు దీనిని తీసుకొచ్చామన్నారు. కూల్ రూఫ్ పాలసీ భవిష్యత్ తరాలకు ఉపయోగపడే కార్యక్రమం అని పేర్కొన్నారు. ఈ ఏడాది హైదరాబాద్‌లో 5 చదరపు కిలోమీటర్ల కూల్ రూఫ్ అమలుచేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. డబుల్ బెడ్‌రూం ఇండ్లన్నిటిపై కూల్ రూఫ్ అమలు చేస్తామన్నారు. 2030 నాటికి రాష్ట్రంలో 200 చదరపు కిలోమీటర్ల కూల్ రూఫ్ టాప్ ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
600 చదరపు గజాలు, అంతకంటే ఎక్కువ స్థలంలో కట్టే భవనాలకు కూల్ రూఫ్ ఏర్పాటును తప్పనిసరి చేస్తామని వెల్లడించారు. కూల్‌రూఫ్ వల్ల మీటరుకు రూ.300 మాత్రమే ఖర్చవుతుందని చెప్పారు. కూల్‌రూఫ్ పెయింట్ వేయడం వల్ల కరెంటు చార్జీలు ఆదా అవుతాయని చెప్పారు. ఇప్పటికే కట్టిన భవనాలపై కూడా కూల్‌రూఫ్ విధానం అమలుచేయవచ్చని వెల్లడించారు.
ఈ పాలసీలో భాగంగా రాష్ట్రంలో కూల్‌రూఫ్‌ల ఏర్పాటుకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తామని, అనుసరించేవారికి ప్రోత్సాహకాలు ఇస్తామని వెల్లడించారు. పాలసీలు, చట్టం చేయడం చాలా సులువని, కానీ వాటిని అమలు చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని అన్నారు. విద్యుత్ వాహనాల వినియోగం పెరగాలనేది సీఎం కేసీఆర్ ఆశయమని తెలిపారు. భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్‌కు హైదరాబాద్‌లో రెండు ప్లాంట్‌లు ఏర్పాటుచేశామని మంత్రి కేటీఆర్ అన్నారు.







