తనపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తాను ఏ పరీక్షకైనా సిద్ధమేనని వేములవాడ వేదికగా ప్రకటించారు. ఈ మేరకు బీజేపీ నేతలకు కేటీఆర్ సవాల్ విసిరారు. డ్రగ్స్ పరీక్షకు రక్తంతో పాటు అవసరమైతే జుట్టు, గోళ్లు, కిడ్నీలు కూడా ఇస్లానని, ఏ డాక్టర్ ను పంపినా తాను సిద్ధంగానే వున్నానని ప్రకటించారు. తాను ఏ దోషం లేకుండా బయటకు వస్తానని, అప్పుడు కరీంనగర్ చౌరస్తాలో మీ చెప్పుతో మీరే కొట్టుకునేందుకు సిద్ధమా? అంటూ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి సవాల్ విసిరారు. భైంసాను దత్తత తీసుకుంటామని బండి సంజయ్ ప్రకటించారని, తన సొంత పార్లమెంట్ నియోజకవర్గంలోని సిరిసిల్ల నేత కార్మికుల కోసం 8 సంవత్సరాలుగా మెగా పవర్ లూం క్లస్టర్ అడుగుతుంటే ఎందుకు తేలేకపోతున్నారని నిలదీశారు.
‘సిరిసిల్ల ఎమ్మెల్యేగా గత ఎనిమిదేండ్ల నుంచి ఎక్కని కొండ లేదు.. మొక్కని బండ లేదు. ఢిల్లీలో ఉండే ప్రతి అడ్డమైన మంత్రి దగ్గరికి పోయి దండం పెట్టినా కనికరించలేదు. నేను తెలంగాణ టెక్స్‌టైల్స్ శాఖ మంత్రిని, సిరిసిల్ల ఎమ్మెల్యేగా నేత కార్మికుల పక్షాన అడుగుతున్న.. ఆ ప్రాంతానికి మెగా పవర్‌లూం ఇవ్వండి అని అడిగితే దున్నపోతుపై వానపడ్డట్టు కేంద్రం వ్యవహరించింది’ అని కేటీఆర్ మండిపడ్డారు.







