ఆడపిల్లల విద్య విషయంలో అండగా ఉండేందుకు ఎప్పుడు ముందుండే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన మంచి మనసుతో నిరుపేద విద్యార్థిని జీవితాన్ని నిలబెట్టారు. తల్లిదండ్రులు లేని రుద్ర రచన అనే ఇంజనీరింగ్ విద్యార్థిని చదువుకు అవసరమైన సహాయం చేసి ఆమె ఇంజనీరింగ్ పూర్తి అయ్యేలా చూశారు. అయితే తన ఇంజినీరింగ్ విద్య పూర్తయ్యేందుకు సహకరించిన కేటీఆర్ పట్ల రుద్ర రచన ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. ఆమె చూపిన అభిమానానికి కేటీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. తాను పొదుపు చేసుకున్న డబ్బులతో వెండి రాఖీ తయారు చేయించానన్న రచన, ఆ రాఖీని కేటీఆర్‌కు కట్టింది.
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తండ్రియాల గ్రామానికి చెందిన రుద్ర రచన చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి స్థానిక బాలసదనంలో ఉంటూ జగిత్యాల ప్రభుత్వ బాలికల హైస్కూల్లో 10వ తరగతి వరకు చదివింది. ఆ తర్వాత హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని స్టేట్ హోమ్‌లో ఉంటూ పాలిటెక్నిక్ విద్య పూర్తి చేసింది. ఈసెట్ ప్రవేశ పరీక్ష ద్వారా హైదరాబాద్ సీబీఐటీ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్‌లో ఇంజనీరింగ్ సీటు సంపాదించింది. అయితే తల్లిదండ్రులు లేని రుద్ర రచన తన ఇంజనీరింగ్ ఫీజులు చెల్లించలేకపోయింది. రుద్ర రచన ఆర్ధిక ఇబ్బందులను సామాజిక మాధ్యమాల ద్వారా 2019లో తెలుసుకున్న కేటీఆర్, ఆమెను ప్రగతి భవన్ పిలిపించుకొని ఇంజినీరింగ్ చదువు పూర్తి అయ్యేందుకు అవసరమైన ఖర్చులను భరిస్తానని భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రుద్ర రచన ఇంజినీరింగ్ ఫీజులు, హాస్టల్ సంబంధిత ఖర్చులను కేటీఆర్ వ్యక్తిగతంగా భరించారు. కేటీఆర్ ఆర్ధిక సహాయంతో ఇంజినీరింగ్ చదువుతున్న రుద్ర రచన, ఇటీవల జరిగిన క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో నాలుగు ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాన్ని సాధించింది.