ఎవరు నీతి మంతులో, ఎవరు అవినీతిపరులో, ఎవరు ఏం తప్పు చేశారో 2023 లో ప్రజలే తీర్పు ఇస్తారని మంత్రి కె. తారక రామారావు అన్నారు. మూడో సారి కూడా ముఖ్యమంత్రిగా కేసీఆర్ ను ఎన్నుకోవాలని, కేసీఆర్‌ను కాపాడుకొని ఈ దేశానికి స్పష్టమైన సందేశం ఇద్దాం అని కేటీఆర్ పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణకు పట్టిన శని బీజేపీ అని మండిపడ్డారు. మోడీకి, ఈడీకి, బోడికి భయపడేది లేదు.. భయపడేది దొంగలు మాత్రమే అని అన్నారు.
ప్రజల వద్దకు వెళ్లి ప్రజా కోర్టులో తేల్చుకుందాం అని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పథకాలు దేశ వ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. తెలంగాణలో జరిగిన డెవలప్ మెంట్ కర్నాటక, మహారాష్ట్రలో కనిపిస్తుందా? అంటూ ప్రశ్నించారు. విద్యుత్, సాగునీరు తెలంగాణలో పుష్కలంగా అందిస్తున్నామన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిందే తెలంగాణ పోరాటమని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

రెండు రోజుల క్రితం తెలుగు సినిమా RRR చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చింది. ఈ దేశంలో అద్భుతమైన మహానటుడు ఉన్నాడు. అతన్నిపంపితే ఆస్కార్ తప్పకుండా వచ్చేది అంటూ ప్రధాని మోదీని ఉద్దేశించి పరోక్షంగా దెప్పిపొడిచారు. రైతుల ఆదాయం డబుల్ చేస్తాను అన్నారని, కానీ రైతుల ఆదాయం రెట్టింపు కాలేదంటూ విమర్శలకు దిగారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని అన్నారని, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. నల్లధనం తెస్తానని చెప్పారు, దాన్ని గురించి అడిగితే తెల్ల ముఖమేస్తున్నారంటూ కేటీఆర్ మండిపడ్డారు.

వచ్చే ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ గల్లంతు చేయాలని చెప్పిన కేటీఆర్..తెలంగాణపై కేంద్రం కక్ష గట్టిందని మండిపడ్దారు. తెలంగాణకు పట్టిన శని బీజేపీ అని వ్యాఖ్యానించారు. దేశ సంపదను ప్రధాని మోదీ అదానీకి దోచిపెడుతున్నారని మండిపడ్డారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని, బీజేపీ తెలంగాణకు పట్టిన దరిద్రమంటూ విరుచుకుపడ్డారు.