తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. కేంద్రానికి రాష్ట్రం కట్టింది 3.68 లక్షల కోట్లని, రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది 1.68 లక్షల కోట్లని, ఎవరి సొమ్ముతో ఎవరు జల్సాలు చేస్తున్నారో బీజేపీ చెప్పాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. హుజుర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగించారు. తాను చెప్పింది తప్పే అయితే… మంత్రి పదవి వదులుకుంటానని, బీజేపీ తప్పు అయితే ప్రజలకు సమాధానం చెప్పాలని కేటీఆర్ సవాల్ విసిరారు. ఉద్యమ సమయంలోనూ కిషన్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదని గుర్తు చేశారు. మతం పేరుతో రాజకీయాలు చేస్తున్న బీజేపీని ప్రజలు నమ్మవద్దని కోరారు.
భారతదేశానికి దిక్సూచిలా తెలంగాణ రాష్ట్ర పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. రూ. 30 వేల కోట్లతో దామరచర్లలో అల్ట్రా మెగా వపర్ ప్లాంట్‌ను నిర్మిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం అని స్పష్టం చేశారు. ఇవాళ ఇంటింటికి సీఎం కేసీఆర్ పథకాలు అందుతున్నాయని గుర్తు చేశారు.తెలంగాణలో పల్లె ప్రగతి ద్వారా అద్భుతంగా పల్లెలు బాగు పడ్డాయని, భారతదేశంలోనే తెలంగాణా గ్రామ పంచాయతీలు గొప్ప గుర్తింపు తెచ్చుకున్నాయని తెలిపారు. ఉప ఎన్నికల తర్వాత హుజుర్‌నగర్ నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందిందని చెప్పారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారిందని, దేశాన్ని బాగు చేయాలన్నదే కేసీఆర్ లక్ష్యం అని కేటీఆర్ అన్నారు.