మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటనతో హైదరాబాద్ కి మరో ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ సంస్థ రానుంది. దావోస్ లో జరుగుతున్న ఆర్థిక వేదిక సదస్సు వేదికగా ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కూడా కుదిరింది. హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ (C4IR)తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం ఈ సంస్థ అమెరికా, బ్రిటన్ లో సేవలు అందిస్తోంది. తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదిరిన తర్వాత… మొట్ట మొదటి సారిగా మన భారత్ కి రానుంది. అందునా తెలంగాణలో పెట్టుబడులు పెట్టనుంది. తెలంగాణ ప్రభుత్వానికి, C4IR సంస్థతో ఒప్పందం కుదరడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జుర్జెన్స్ తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శక్తి నాగప్పన్‌తో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. హెల్త్‌కేర్‌, లైఫ్‌ సెన్సెస్‌పై దృష్టి సారించిన సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ (C4IR)ని స్థాపించడానికి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ హైదరాబాద్‌ను తన భారతదేశ హబ్‌గా ఎంచుకున్నందుకు సంతోషం ఉందన్నారు. హైదరాబాద్‌లో సీ4ఐఆర్‌ సంస్థ ఏర్పాటుతో తెలంగాణలో లైఫ్ సైన్సెస్ రంగానికి ప్రస్తుతం ఉన్న పర్యావరణ వ్యవస్థ, రాష్ట్ర ప్రభుత్వ సమర్థతను ప్రతిబింబిస్తుందని మంత్రి అన్నారు.