కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి సవాల్ విసిరారు. దేశ ఆర్థిక పరిస్థితిపై చర్చకు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని సవాల్ విసిరారు. దేశ ఆర్థిక పరిస్థితి పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థను బంగ్లాదేశ్, శ్రీలంక, తదితర దేశాలతో పోల్చారని, దీనిపై కేసీఆర్‌తో చర్చకు సిద్ధమని ప్రకటించారు. ప్రెస్‌క్లబ్, గన్‌పార్క్, ప్రగతి భవన్‌, ఫార్మ్‌హౌస్‌లో ఎక్కడ చర్చకు వస్తారు? రాజీనామా పేపర్ జేబులో పెట్టుకుని వస్తారా? అని ప్రశ్నించారు. చర్చలో కల్వకుంట్ల కుటుంబం భాష కాకుండా తెలంగాణ భాష మాత్రమే మాట్లాడాలని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ దిగిజారిందంటూ తప్పుడు సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రాన్ని విమర్శించేందుకే అసెంబ్లీ సమావేశాలను వాడుకున్నారని, బడ్జెట్ పై సీఎం ఒక్క నిమిషం కూడా మాట్లాడలేదని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.

 

కేంద్రంపై కేసీఆర్ బురద జల్లుతున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. దేశ ఆర్థిక పరిస్థితిపై IMF ఏం చెప్పిందో సీఎం కేసీఆర్ గూగుల్ లో చూసుకోవాలని కేంద్ర మంత్రి ఎద్దేవా చేశారు. బడ్జెట్ పై కేసీఆర్ ఒక్క నిమిషం కూడా మాట్లాడలేదని, కేంద్రాన్ని తిట్టేందుకే అసెంబ్లీ సమావేశాలు పెట్టుకున్నారని మండిపడ్డారు. బడ్జెట్ సమావేశాల్లో కేసీఆర్ కాంగ్రెస్ ను పొడిగి, బీజేపీని విమర్శించారన్నారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టుకోవడంలో కేసీఆర్ సిద్ధహస్తులని చురకలంటించారు.

 

గతంలో కమ్యూనిస్టులను విమర్శించి, ఇప్పుడు వారిని నెత్తినెత్తుకున్నారని గుర్తు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూమ్, ఎస్సీలకు మూడెకరాల భూమి…. వీటిపై ఎందుకు చర్చించలేదని నిలదీశారు. కేసీఆర్ రాజీనామా చేస్తానని గతంలో చాలా సార్లు ప్రకటించారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ఇంకో ఆరేడు నెలలు ఆగితే… ఆయన రాజీనామా చేసే పరిస్థితి తప్పకుండా వస్తుందన్నారు. కేసీఆర్ చెప్పిన లెక్కలపై తాను చర్చకు సిద్ధమేనని, ఎక్కడికి రమ్మంటారో ఆయనే చెప్పాలన్నారు.