టీఆర్ఎస్ పై, సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి జగదీశ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కౌరవుల పక్షాన వుండి ధర్మయుద్ధం గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వంపై ఈటల అసత్య ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ భవన్ లో మంత్రి జగదీశ్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ముఖ్యమంత్రిపై బీజేపీ నాయకులు వాడే భాషను ప్రజలు గమనిస్తున్నారని, ఈటల ధర్మం, భాష గురించి మాట్లాడి సానుభూతి పొందాలంటే సాధ్యం కాదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని 2 సంవత్సరాలుగా ఈటల ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత ఏ ఎన్నిక‌ల్లో కూడా రాజ‌కీయ ఘ‌ర్ష‌ణ‌లు చోటు చేసుకోలేదు అని స్ప‌ష్టం చేశారు. ఒకచిన్న రాజ‌కీయ కేసు కూడా న‌మోదు కాలేదని తెలిపారు. పోలీసుల‌ను టీఆర్ఎస్ పార్టీ ఎట్టి ప‌రిస్థితుల్లో కూడా వాడ‌ద‌ని ఈట‌ల రాజేంద‌ర్‌కు తెలుసు అని మంత్రి పేర్కొన్నారు. ఏ ఒక్క‌రోజు కూడా టీఆర్ఎస్ పార్టీ పోలీసుల‌ను వాడుకోలేదు. పోలీసుల‌ను రాజ‌కీయాల్లో ఉప‌యోగించ‌కూడ‌ద‌నేది కేసీఆర్ ఆలోచ‌న‌ అని పేర్కొన్నారు.

 

బీజేపీకి పరివేలి గ్రామంలో మెజారిటీ రాదని స్పష్టంగా తెలిసిపోయిందని, గొడవను ఆపేందుకు ప్రయత్నించిన పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కూడా దాడి చేశారని మంత్రి జగదీశ్ ఆరోపించారు. ప్రజలు లేకపోవడం వల్లే బీజేపీ సభలను రద్దు చేసుకుందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఉన్నంత స్వేచ్ఛాయుత వాతావరణం ఏ రాష్ట్రంలో కూడా లేదని ప్రకటించారు.