కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్‌ రెడ్డి బీజేపీలో చేరారని మంత్రి జగదీశ్‌ రెడ్డి మరోసారి విమర్శించారు. మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీ దగ్గర తాకట్టు పెట్టిన దుర్మార్గుడని ఆగ్రహం వ్యక్తంచేశారు. మునుగోడు నియోజకవర్గంలోని వెలమకన్నెలో మంత్రి జగదీశ్‌ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్‌ఎస్‌కు రాజకీయాలు ముఖ్యం కాదని, అభివృద్ధే లక్ష్యమని స్పష్టం చేశారు. మునుగోడు నియోజకవర్గాన్ని దశాబ్దాలుగా పీడించిన ఫ్లోరైడ్‌ సమస్యను తీర్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని వెల్లడించారు. కేసీఆర్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి పథంలో పయనిస్తోందని, దీన్ని అడ్డుకోవడడానికే బీజేపీ మునుగోడు ఉప ఎన్నికకు కుట్రలు పన్నిందని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా మునుగోడులో గెలిచేది టీఆర్ఎస్ అభ్యర్థేనని మంత్రి జగదీశ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

 

 

నాలుగేళ్లు ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గానికి ఏం చేయలేనివాళ్లు ఇప్పుడు ఏం చేస్తారని మంత్రి జగదీశ్ రెడ్డి బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు.మరో ఏడాదిలో సాధారణ ఎన్నికలుండగా… ఇప్పుడు ఉప ఎన్నికకు పోవాల్సిన అవసరమ ఏమొచ్చిందని నిలదీశారు. రాజగోపాల్ రెడ్డి తన వ్యాపారం కోసమే రాజీనామా చేశారు తప్ప మరొకటి కాదన్నారు. మునుగోడులో బీజేపీ గెలిస్తే రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతుందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. బీజీపీ అధికారంలోకి వస్తే రైతుల మోటర్లకు మీటర్లు పెడుతారని ఆరోపించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ ను లేకుండా చేసిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని కొనియాడారు.