మునుగోడు బైపోల్ ను అన్ని పార్టీలూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న నేపథ్యంలో మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాజగోపాల్ రెడ్డికి అప్పనంగా కట్టబెట్టిన 18 కోట్లను మునుగోడు డెవలప్ మెంట్ కు అస్తే.. తాము ఉప ఎన్నికల బరి నుంచి తప్పుకుంటామని సంచలన ప్రకటన చేశారు. ఈ విషయంలో తాను సీఎం కేసీఆర్ ను ఒప్పిస్తానని, ప్రాధేయపడైనా ఒప్పిస్తానని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారాన్ని అధికార టీఆర్ఎస్ నేడు ప్రారంభించింది. మునుగోడు మండలం కొరటికల్ నుంచి ఇవాళ ప్రభాకర్ రెడ్డి ప్రచారాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. ఈ ప్రచార కార్యక్రమానికి సీపీఐ, సీపీఎం నేతలు, శ్రేణులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి పై వ్యాఖ్యలు చేశారు.

 

రాజ‌కీయాల కోస‌మే ఉప ఎన్నిక‌లు సృష్టించార‌ని ధ్వ‌జ‌మెత్తారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవ‌డానికే ఈ కుట్ర‌లు, కుతంత్రాలు అని మండిప‌డ్డారు. స‌స్య‌శ్యామ‌లం అవుతున్న తెలంగాణ‌లో మంట‌లు సృష్టించేందుకు కుయుక్తులు ప‌న్నుతున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. హిందూ మ‌తం గురించి వేదాలు వ‌ల్లించే బీజేపీ ప్ర‌భుత్వం.. యాదాద్రి పున‌ర్ నిర్మాణానికి రూ. 100 కూడా చందా ఇవ్వ‌లేద‌ని గుర్తు చేశారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ రూ. 1000 కోట్ల‌తో యాదాద్రిని పున‌ర్ నిర్మించారు. మోదీ, అమిత్ షాలు మాత్రం రాజ‌గోపాల్ రెడ్డికి రూ. 18 వేల కోట్లు అప్ప‌నంగా అప్ప‌గించార‌ని జగదీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు.