నిర్మాణ నైపుణ్య శిక్షణ సంస్థ అవకాశాలు అందిపుచ్చుకోవాలని నిరుద్యోగ యువతకు రాష్ట్ర మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట కేసీఆర్ నగర్ లో ప్రభుత్వ సహకారంతో ఎల్అండ్ టీ సంస్థ నిర్వహిస్తున్న నిర్మాణ నైపుణ్య శిక్షణ సంస్థను శుక్రవారం సాయంత్రం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రూ.5 కోట్లతో సిద్ధిపేటలో తొలిసారిగా ఎల్అండ్ టీ సంస్థ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఎల్ అండ్ టి సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నిర్మాణ నైపుణ్య శిక్షణ ద్వారా ఎంతో ఉపాధి మార్గాలు లభిస్తాయని చెప్పుకొచ్చారు. మూడు నెలలు 90 రోజులు శిక్షణ, తర్వాత ఎల్అండ్ టీ సంస్థ నిర్మాణ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు ఇతర నిర్మాణం సంస్థలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉంటాయని వెల్లడించారు.
ఎల్అండ్ టీ సంస్థ వారిచే సర్టిఫికెట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్ఎస్డిసి సర్టిఫికెట్ ఇవ్వబడుతుందని చెప్పారు. హాస్టల్లో వసతితో పాటు భోజనం పెట్టి మూడు నెలలు శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.