ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ తీవ్రంగా మండిపడ్డారు. సొంతరాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్‌లో బొక్కబొర్లా పడిన నడ్డా.. తెలంగాణకు వచ్చి సినిమా డైలాగులు చెప్తే ఎవరూ నమ్మరని అన్నారు. 8 ఏండ్ల పాలనలో దేశానికి, రాష్ర్టానికి బీజేపీ ఏం చేసిందో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. పథకాలు మావి, పబ్లిసిటీ మీదా? అని ప్రశ్నించారు. కేంద్రం కోతల వల్లే ఉద్యోగులకు జీతాలు ఆలస్యంగా చెల్లించాల్సి వస్తున్నదని స్పష్టంచేశారు. రాష్ట్రంలో ఏం జరుగుతున్నదనే కనీస అవగాహన లేకుండా నడ్డా మాట్లాడారని, రాష్ట్ర ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేశారని హరీశ్‌రావు మండిపడ్డారు.

కరీంనగర్‌ సభలో నడ్డా సినిమా డైలాగుల్లా మాట్లాడారే తప్ప, వాస్తవాలు తెలుసుకుని మాట్లాడలేదని అన్నారు. జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఉండి.. సినిమా డైలాగులా మీరు చెప్పేది అంటూ మండిపడ్డారు. దేశ ప్రజలకు, తెలంగాణకు ఏం చేశారో చెప్పలేదని, ఆయన మాటల్లో సొల్లు మాటలు తప్ప ప్రజలకు మేలు చేసేది ఒక్కటీ లేదని హరీశ్ విమర్శించారు. మునుగోడులో ఓడిపోయినా వారికి ఇంకా జ్ఞానోదయం కాలేదని దెప్పిపొడిచారు.

ఒకవైపు ఢిల్లీలో అవార్డులు ఇస్తూ.. మరోవైపు గల్లీల్లో బద్నాం చేయడం బీజేపీ నాయకులకు అలవాటేనని మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణకు అవార్డు రాని నెల, ప్రశంసలు దక్కని డిపార్ట్‌మెంట్‌ లేదన్నారు. పనిచేయకుండానే అవార్డులు ఇస్తారా? అని ప్రశ్నించారు. తెలంగాణకు అవార్డులు ఇవ్వాల్సి వస్తుందని బహుశా వాటిని కేంద్రం రద్దు చేసినా ఆశ్చర్యం లేదన్నారు. బీజేపీ నేతలు తమ సభల్లో రాష్ర్టానికి ఏం చేస్తారో స్పష్టంగా చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇక… ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు రావడంపై కూడా మంత్రి స్పందించారు. బండి సంజయ్ చెప్పారు.. ఈడీ వచ్చింది అంటూ మంత్రి ఆరోపించారు.