సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో నిర్వహించిన కార్యక్రమంలో 58 జీవో లబ్ధిదారులకు మంత్రి హరీశ్ రావు పట్టాలు పంపిణీ చేశారు. రాష్ట్రంలో అత్యధికంగా 738 మంది పేదలకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేసిన నియోజకవర్గం పటాన్‌చెరు అని వెల్లడించారు. అమీన్‌పూర్ మండలంలో 265, గుమ్మడిదలలో 7, జిన్నారంలో 12, పటాన్‌చెరులో 188, రామచంద్రాపురంలో 266 మందికి ఇండ్ల పట్టాలు పంపిణీచేసినట్టు వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నారని, కోట్ల విలువైన భూముల్లో ఇండ్ల పట్టాలను గరీబుల కోసం 58 జీవో ద్వారా అందజేస్తున్నారని తెలిపారు. రూపాయి ఖర్చు లేకుండా పారదర్శకంగా రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల విలువ చేసే ప్లాట్‌ను రెగ్యులరైజ్ చేశామని వివరించారు.

కాంగ్రెస్ హయాంలో పేదలు ఇండ్లు కట్టుకుంటే జేసీబీలతో కూల్చేవారని గుర్తు చేశారు. రాష్ట్రంలోనే అత్యధికంగా 13 బస్తీ దవాఖానలను ఈ నియోజకవర్గంలోనే ఏర్పాటు చేశామని చెప్పారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణాకి రావాల్సిన రూ.40 వేల కోట్ల నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నదని మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎఫ్‌ఆర్‌ఎంబీలో కోత పెట్టడం ద్వారా రాష్ర్టానికి రావాల్సిన రూ.15 వేల కోట్ల నిధులు నిలిచిపోయాయని చెప్పారు. దేశ చరిత్రలో ఏనాడూ ఏ ప్రధానీ రాష్ర్టాలకు రావాల్సిన ఆర్థిక సంఘం నిధులను నిలిపివేయలేదని హరీశ్ విమర్శించారు.