వైద్య విద్యార్థి ప్రీతి ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని వైద్య ఆరోగ్య మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.
వైద్య విద్యార్థి ప్రీతి ఘటన బాధాకరమన్నారు. దోషులు ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రీతీకి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించామని, ప్రత్యేక వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు ప్రీతి తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడిన హరీశ్… వారికి ధైర్యం చెప్పారు. ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. దోషులు ఎవరైనా వదిలిపెట్టేది లేదని పేర్కొన్నారు.

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వైద్య విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే వుందని నిమ్స్ వైద్యులు ప్రకటించారు. వెంటిలేటర్ తో పాటు ఎక్మో సాయంతో చికిత్స అందిస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు ప్రీతి కేసులో విచారణ వేగంగా సాగుతోంది. సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ కేసుతో పాటు ర్యాగింగ్ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. అయితే ప్రీతిని సైఫ్ వేధింపులకు గురి చేసినట్టు పోలీసులకు ఆధారాలు లభ్యమయ్యాయి. సైఫ్ ఫోన్ను చెక్ చేసిన పోలీసులకు చాటింగ్లో కొత్త విషయాలు వెలుగు చూశాయి.