జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మూడు ముక్కలాట సీఎం అని విమర్శించడంతో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు పవన్ పై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. పవన్ ఉపన్యాసం ఆంబోతు రంకెలేసినట్లు వుందని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. పవన్ పార్టీకి ఎజెండా గానీ, విధానం గానీ ఏమీ లేవని, పవన్ ఓ రాజకీయ వ్యభిచారి అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. కాపుల మీద పవన్ కి పేటెంట్ వున్నట్లుగా మాట్లాడుతున్నారన్నారు. ”జనసేన పేరు తీసి చంద్రసేనా అని పెట్టుకుంటే బాగుంటుంది. ఆంబోతు గమ్యం లేకుండా ఎలా పరిగెడుతుందో అలా ఉంది పవన్ స్పీచ్ ఆంబోతు రంకెలు నీ నోటి నుండి వచ్చిన రంకెలు ఒకలాగే ఉంది.” అని మంత్రి అమర్నాథ్ మండిపడ్డారు.
పవన్ సినిమాల్లో హీరో కావొచ్చు కానీ… రాజకీయాల్లో మాత్రం జీరో అని మంత్రి అమర్నాథ్ ఎద్దేవా చేశారు. సంక్రాంతి మామూళ్లు తీసుకొని, రణ స్థలంలో ఈవెంట్ నిర్వహించి వెళ్లారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుతో రెండున్నర గంటల పాటు దేశం గురించే మాట్లాడారని పవన్ చెబుతుంటే ఎవరూ నమ్మరన్నారు. పవన్ అన్న నటించిన పునాదిరాళ్లు పడక ముందే తమ కుటుంబంలో రాజకీయాలు ప్రారంభమయ్యాయని మంత్రి అమర్నాథ్ అన్నారు. పవన్ లాగులు వేసుకొనే సమయానికే, తన తాత ఎమ్మెల్యే అయ్యారని, తమ కుటుంబం గురించి పవన్ కి ఏమాత్రం తెలియదని మంత్రి అమర్నాథ్ విరుచుకుపడ్డారు.












