అసోం సీఎం హిమంత విశ్వశర్మపై తెలంగాణ మంత్రులు తీవ్రంగా మండిపడ్డారు. హైదరాబాద్ లో మత ఘర్షణలు రెచ్చగొట్టడం కోసమే ఆయన హైదరాబాద్ కు వచ్చారని మంత్రి ఎర్రబెల్లి మండిపడ్డారు. అసోంలో కూడా నిమజ్జనాలు జరుగుతున్నాయని, అయినా… ఆయన హైదరాబాద్ కు రావడం వెనుక వున్న ఆంతర్యం ఏంటని సూటిగా ప్రశ్నించారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన తెలంగాణలో రాజకీయ దురుద్దేశంతోనే బీజేపీ నేతలు రెచ్చగొట్టే కుట్రలు చేస్తున్నారని ఎర్రబెల్లి మండిపడ్డారు. సీఆర్ సారథ్యంలో 8ఏళ్ల నుండి ఎలాంటి అల్లర్లు లేకుండా హైదరాబాద్లో నిమజ్జనం జరుగుతుందని.. ఈ సారి అస్సాం సీఎం రాక వల్ల ఉద్రిక్తత చోటుచేసుకుందన్నారు.
హైదరాబాద్ ప్రజలను రెచ్చగొట్టడానికే అసోం సీఎంను రప్పించారని మంత్రి తలసాని ఫైర్ అయ్యారు. గణేశ్ నిమజ్జనం కోసం వచ్చినప్పుడు గణేషుడి గురించి, శోభాయాత్ర గురించే మాట్లాడాలన్నారు. కానీ… రాజకీయాలు మాట్లాడం పద్ధతి కాదని మండిపడ్డారు. బీజేపీ నేతలు సిటీని ప్రశాంతంగా వుండనివ్వరని మండిపడ్డారు.
ఇక…. అసోం సీఎం ముందు నుంచి మైక్ లాక్కొని, గొడవకు దిగిన టీఆర్ఎస్ నేత నందు బిలాల్ ఈ ఘటనపై స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను దూషిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని అసోం సీఎం హిమంత బిస్వాను గోషామహల్ టీఆర్ఎస్ నాయకుడు నందు బిలాల్ హెచ్చరించారు. గణేశ్ ఉత్సవాలకు వచ్చిన అసోం సీఎం.. రాజకీయాలు మాట్లాడటం సమంజసం కాదన్నారు. తమ సీఎంను దూషించినందుకే ఆయనను మాట్లాడనివ్వకుండా అడ్డుక్కున్నానని తెలిపారు. హైదరాబాద్‌లో అసోం సీఎం శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.