హైదరాబాద్ లో గణపతి నిమజ్జనం కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. పోలీసు బందోబస్తు ఓ వైపు, మరోవైపు క్రేన్లు, జీహెచ్ఎంసీ సిబ్బంది… ఇలా అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేసేసింది. ఇక… నిమజ్జనాన్ని వీక్షించడానికి వచ్చే ప్రయాణికుల కోసం కూడా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలోనే జంటనగల్లో మెట్రో రైళ్ల సమయాన్ని పొడిగించారు. గణేష్ నిమజ్జనం నేపథ్యంలో మెట్రో రైళ్ల ట్రిప్పులు, సమయాన్ని పొడిగిస్తున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు.ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి అర్థరాత్రి 2 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. తిరిగి మరుసటి రోజు యథావిథిగా 6 గంటల నుంచే మెట్రో సేవలు కొనసాగుతాయని తెలిపారు. ప్రయాణికులందరూ మెట్రో సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు. చివరిస్టేషన్ నుంచి అర్ధరాత్రి ఒంటిగంటకు ఆఖరి రైలు బయలుదేరనుందని పేర్కొన్నారు.

 

నిమజ్జనం సందర్భంగా శుక్ర, శని వారాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో వుంటాయని ట్రాఫిక్ జాయింట్ సీపీ ప్రకటించారు. నిమజ్జనం చూడడానికి వచ్చే భక్తులు సొంత వాహనాలపై కాకుండా…. ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లల్లో రావాలని సూచిస్తున్నారు. దీని ద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు వుండవని అధికారులు తెలిపారు. ఇక.. నిమజ్జనం కోసం కొలనుల వద్ద తాగునీటి వసతితో పాటు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా కూడా చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. పారిశుద్య సిబ్బంది కూడా అందుబాటులోనే వుంటారని పేర్కొంది.