హైదరాబాద్ చిత్రపురి కాలనీలో డబుల్ బెడ్ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమ వేదికగా మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో పెద్దరికం చెలాయించాలన్న ఉద్దేశం తనకు లేదని, తనకు ఎలాంటి కుర్చీలూ వద్దని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఇండస్ట్రీ పెద్దరికం తనకొద్దని తేల్చిచెప్పారు. కొందరు చిన్నవాళ్లమని చెప్పుకుంటూ తనను పెద్ద చేస్తున్నారని అన్నారు. చిత్రపురి కాలనీ నిర్మాణంలో అవకతవకలు జరిగిన విషయం తనకు తెలియదని అన్నారు. అందుకే దానిపై మాట్లాడనని అన్నారు. చిత్రపురి కాలనీలో నూతన గృహా సముదాయాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలుగు సినీ కార్మికులకు గృహాసముదాయం ఏర్పడిందని అన్నారు. సినీ కార్మికులకు చేదోడు, వాదోడుగా ఉంటానని, ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా తాను సపోర్ట్ గా ఉంటానని హామీ ఇచ్చారు. సినీ కార్మికులకు సొంత ఇల్లు ఉండటం అదృష్టంగా భావిస్తున్నానని చిరంజీవి, ఎంతో కష్టపడి గృహ సముదాయాన్ని పూర్తి చేసిన అనిల్ , దొరైలను ప్రశంసించారు.
సినిమా షూటింగ్స్, ఇతర కార్యక్రమాలతో ఈ రోజు కాస్త బిజీగానే వున్నా. దాంతో ఈ కార్యక్రమానికి రాలేనని చెబుదామని అనుకున్నా. సరిగ్గా 22 సంవత్సరాల క్రితం ఇదే రోజున చిత్రపురి కాలనీకి శంకుస్థాపన జరిగిందని, అందుకే ఈ రోజే ప్రారంభిద్దామని అనుకున్నట్లు చైర్మన్ అనిల్ దొరై తెలిపారు. ఆయన చెప్పిన మాట విన్నాక రావాలని నిర్ణయించుకున్నా. ప్రోగ్రామ్స్ అన్నింటినీ వాయిదా వేసుకొని ఇక్కడికి వచ్చా. సినీ కార్మికులకు సైతం సొంత ఇల్లు ఉండాలన్నది నా కల. ఆ కల సాకారం చేయడం కోసం పనిచేసిన వారందరికీ ధన్యవాదాలు అని చిరంజీవి ప్రకటించారు.