కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీని మార్చేసింది. ఇప్పటి వరకూ బాధ్యతలు నిర్వర్తించిన మాణిక్కం ఠాగూర్ ను తెలంగాణ బాధ్యతల నుంచి తప్పించి, గోవాకు పంపింది. ఇక… తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీగా మహారాష్ట్ర పీసీసీ మాజీ అధ్యక్షుడు మాణిక్ రావు ఠాక్రేను నియమించింది. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉత్తర్వులు జారీ చేశారు. మాణిక్‌రావు ఠాగూర్‌.. గతంలో మహారాష్ట్ర మంత్రిగాను, మహారాష్ట్ర కౌన్సిల్‌లో డిప్యూటీ చైర్మన్‌గానూ పనిచేశారు. 2009 నుంచి 2015 వరకు మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. శరద్ పవార్, విలాస్ రావు దేశ్ ముఖ్, సుశీల్ కుమార్ షిండే మంత్రి వర్గంలో మంత్రిగా పనిచేశారు.అటు పరిపాలన అనుభవం, ఇటు పార్టీ అనుభవం రెండూ వుండటం, పైగా తెలంగాణ పక్కనే మహారాష్ట్ర వుండటంతో వ్యవహారాలను చక్కబెట్టడం ఈజీ అవుతుందని కూడా అధిష్ఠానం భావించింది.

సీనియర్లు, జూనియర్లంటూ తెలంగాణ కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. బహిరంగంగానే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. బహిరంగంగానే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ ని బాయ్ కాట్ చేస్తున్నామని, తామే నిజమైన కాంగ్రెస్ నేతలంటూ సీనియర్లందరూ తెగేసి చెప్పడంతో అధిష్ఠానం అలర్ట్ అయ్యింది. వెంటనే తెలంగాణ కాంగ్రెస్ నేతలను చక్కబెట్టాలని అధిష్ఠానం దిగ్విజయ్ సింగ్ ని పంపింది. రెండో రోజుల పాటు పర్యటించి వెళ్లారు. అందరూ ఏకతాటిపై వుండాలని సూచించారు.