అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా మల్లికార్జున ఖర్గే ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ఎంపీ శశిథరూర్పై ఆయన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఖర్గేకు 7,897 ఓట్లు రాగా, శశిథరూర్కు వెయ్యి ఓట్లు వచ్చాయి. మరో 416 ఓట్లు అనర్హతకు గురయ్యాయి. ఈనెల 17న ఎన్నికలు జరగ్గా ఇవాళ ఓట్ల లెక్కింపు చేపట్టారు. 137 ఏండ్ల కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ చరిత్రలో అధ్యక్ష పదవికి ఆరుసార్లు మాత్రమే ఎన్నిక జరగడం విశేషం. ఈ ఎన్నికల్లో పార్టీ సీనియర్ నేతలు శశి థరూర్, మల్లిఖార్జున ఖర్గే పోటీపడ్డారు. అయితే, ఈ ఎన్నికల్లో ఖర్గే విజయం సాధించి పార్టీ పగ్గాలు చేపట్టబోతున్నారు.
ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో విజయంతో కాంగ్రెస్ అధ్యక్షుడయిన రెండో దళిత నాయకుడిగా ఖర్గే నిలిచారు. కాంగ్రెస్ అధ్యక్షుడైన తొలి దళిత నాయకుడు బాబూ జగ్జీవన్ రామ్. స్వాతంత్య్రానంతరం పార్టీ నాయకత్వం 75 ఏండ్లలో 42 ఏండ్ల పాటు గాంధీ కుటుంబంతోనే కొనసాగగా.. 33 ఏండ్ల పాటు పార్టీ అధ్యక్ష పగ్గాలు గాంధీయేతర నేతల వద్ద ఉన్నాయి.