మంత్రి మల్లారెడ్డి నివాసంలో రెండో రోజూ కూడా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. షిఫ్గుల వారీగా ఐటీ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలు కీలక డాక్యుమెంట్లను కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకూ 4.5 కోట్ల నగదును సీజ్ చేశారు. మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డితో పాటు అల్లుడు రాజశేఖర రెడ్డి నివాసాల్లోనూ రైడ్స్ నడుస్తున్నాయి. మల్లారెడ్డి కుమారుడు, అల్లుడు కలిసి పలు రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులు కూడా పెట్టారు. డైరెక్టర్లుగా కూడా వున్నారు.
ఈ రైడ్స్ పై మంత్రి మల్లారెడ్డి ఘాటుగా స్పందించారు. రాజకీయ కక్షతోనే ఈ సోదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. దాడులకు బెదిరేది లేదని తేల్చి చెప్పారు. తాను కష్టపడి, సంపాదించి, నిజాయితీగా మెలుగుతున్నానని పేర్కొన్నారు. తాను ఎలాంటి దొంగ వ్యాపారాలు చేయడం లేదని, క్యాసినోలు నడపడం లేదన్నారు. ఉద్దేశ పూర్వకంగానే ఈ దాడులు కొనసాగుతున్నాయని మండిపడ్డారు. సీఆర్పీఎఫ్ అధికారులు తన కుమారుడ్ని కొట్టారని, అందుకే ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు.