తమిళనాడు వ్యాప్తంగా ఆలయాల్లో మొబైల్ ఫోన్లపై మద్రాస్ హైకోర్టు నిషేధం విధించింది. ఈ నిర్ణయం ప్రార్థనా స్థలాల పవిత్రతను కాపాడటానికి ఉపయోగపడుతుందని అని కోర్టు పేర్కొంది. అంతేకాదు ఆలయాల్లో భక్తులకు డ్రెస్ కోడ్ తప్పనిసరి చేయాలని కూడా తెలిపింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మొబైల్ ఫోన్లను భద్రపరిచే లాకర్లు ఏర్పాటుచేయాలని సూచించింది. వీటికి సంబంధించిన స్పష్టమైన ఉత్తర్వులను జారీ చేయాలని హైకోర్టు దేవాదాయ శాఖను ఆదేశించింది. ఆలయ పవిత్రత కాపాడేలా సెల్‌ఫోన్ వినియోగాన్ని నిషేధిస్తూ స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్‌ను ఆదేశించింది.
తూత్తుకుడి జిల్లా తిరుచెందూర్ అర్చకుడు సీతారామన్ దాఖలుచేసిన పిటిషన్‌లో, తిరుచెందూర్ సుబ్రమణ్యస్వామి ఆలయ దర్శనానికి వచ్చే భక్తులు స్వామివారికి నిర్వహించే అభిషేకాలు, పూజలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించడంతో పాటు ఉత్సవమూర్తుల సన్నిధిలో సెల్ఫీలు దిగుతున్నారని, అలాంటి వాటిని అరికట్టేలా ఆలయాల్లో సెల్‌ఫోన్ వినియోగంపై నిషేధం విధించేలా ఉత్తర్వులివ్వాలని పిటిషన్‌లో కోరారు. ఈ నేపథ్యంలోనే మద్రాస్ హైకోర్టు పై విధంగా స్పందించింది.