జీ 20 వేదికగా ప్రధాని మోదీ కీలక ప్రసంగం.. ప్రపంచ శాంతి కోసం పనిచేద్దామని పిలుపు

ఇండోనేషియాలోని బాలీ వేదికగా జీ 20 సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం, కోవిడ్ మహమ్మారి, వాతావరణ మార్పులు, ఆహార, ఇందన భద్రతతో పాటు పలు అంశాలను మోదీ ప్రస్తావించారు. యావత్ ప్రపంచం శాంతికోసం సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అలాగే రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై కూడా మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణ, దౌత్యం అనే రెండు అంశాల ఆధార భూతంగా ప్రపంచం ఓ మార్గాన్ని వెతకాల్సిన అవసరం వుందని నొక్కి వక్కాణించారు.

 

రెండో ప్రపంచ యుద్ధం కారణంగా ప్రపంచం విధ్వంసానికి గురైందని, ఆ సమయంలో శాంతి కోసం కొందరు తీవ్ర ప్రయత్నాలు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు మన వంతు వచ్చిందని మోదీ వ్యాఖ్యానించారు. కరోనా, రష్యా ఉక్రెయిన్ పరిస్థితులు ప్రపంచంలో విధ్వంసం చేస్తున్నాయని అన్నారు. ఈ పరిణామాల వల్ల ప్రపంచ సరఫరా గొలుసు శిథిలావస్థకు చేరుకుందన్నారు. అందుకే అందరూ ఏకం కావాలని మోదీ పిలుపునిచ్చారు. వచ్చే యేడాది జీ 20 సదస్సు బుద్ధుడు, గాంధీ నడయాడిన నేలలో (భారత్) లో జరగనుందని, ఆ వేదికగా ప్రపంచ శాంతికి బలమైన సందేశం ఇద్దామని మోదీ పిలుపునిచ్చారు.



భారతదేశంలో, స్థిరమైన ఆహార భద్రత కోసం, మేము సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని ప్రధాని మోదీ ప్రపంచ నేతలకు వివరించారు. మిల్లెట్ల వంటి పోషకమైన,  సంప్రదాయ ఆహారధాన్యాలను తిరిగి ప్రాచుర్యం పొందేలా చూస్తున్నామని అన్నారు. వచ్చే యేడాది ప్రపంచ మిల్లెట్ల దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంతో జరుపుకుందామని మోదీ పిలుపునిచ్చారు. 

Related Posts

Latest News Updates