రాష్ట్రపతి భవన్‌లో బుధవారం అర్జున అవార్డుల కార్యక్రమం ఘనంగా జరిగింది. క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డును టేబుల్ టెన్నిస్ లెజెండ్ అచంట శరత్ కమాల్ అందుకోగా, అర్జున అవార్డును 25 మంది క్రీడాకారులు స్వీకరించారు. భారత స్టార్ బాక్సర్, తెలంగాణ ముద్దు బిడ్డ నిఖత్ జరీన్ అర్జున అవార్డు అందుకుంది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అర్జున అవార్డులను ప్రదానం చేశారు. అలాగే ఏడుగురు కోచ్‌లను ద్రోణాచార్య అవార్డు, నలుగురు ఆటగాళ్లను ధ్యాన్‌చంద్ అవార్డుతో సత్కరించారు. స్టార్ షట్లర్లు లక్ష్యసేన్, హెచ్‌ఎస్ ప్రణయ్‌లను రాష్ట్రపతి సత్కరించారు. వీరిద్దరూ ఈ ఏడాది థామస్ కప్ గెలిచి చరిత్ర సృష్టించిన భారత జట్టులో సభ్యులు.

ఇక అర్జున అవార్డులను అవినాష్ సాబుల్ (అథ్లెటిక్స్) సీమా పూనియా (అథ్లెటిక్స్), ఆల్డస్ పాల్ (అథ్లెటిక్స్), లక్ష్య సేన్ (బ్యాడ్మింటన్), హెచ్. ఎస్ ప్రణయ్ (బ్యాడ్మింటన్),నిఖత్ జరీన్ (బాక్సింగ్), అమిత్ (బాక్సింగ్), ఆర్ ప్రజ్ఞానంద (చెస్), భక్తి కులకర్ణి (చెస్) ,సుశీలా దేవి (జూడో), సాక్షి కుమారి (కబడ్డీ), నయన్ మోని సైకియా (లోన్‌బాల్), దీప్ గ్రేస్ ఇక్కా (హాకీ), సాగర్ ఓవల్కర్ (మల్కాంబ్), ఓంప్రకాష్ మిథర్వాల్ (షూటింగ్) ఎలవెనిల్ వలరివన్ (షూటింగ్) తదితరులు అందుకున్నారు.

కాగా, రెగ్యులర్ విభాగంలో ద్రోణాచార్య అవార్డులను జీవన్‌జోత్ సింగ్ తేజ (ఆర్చరీ), మహ్మద్ అలీ కమర్ (బాక్సింగ్), సుమా షిరూర్ (పారా-షూటింగ్), సుజిత్ మాన్ (రెజ్లింగ్) అందుకున్నారు. ధ్యాన్ చంద్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులను అశ్విని అక్కుంజీ (అథ్లెటిక్స్), ధరమ్‌వీర్ సింగ్ (హాకీ), బీసీ సురేష్ (కబడ్డీ), నీర్ బహదూర్ గురుంగ్ (పారా అథ్లెటిక్స్)లకు అందజేశారు.












