సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఎన్నికయ్యారు. ఈ పదవికి పార్టీ సీనియర్ నేత పల్లా వెంకట్ రెడ్డి, సాంబశివ రావు ఇద్దరూ పోటీపడ్డారు. సీనియర్లు నచ్చజెప్పినా… పోటీ నుంచి ఇద్దరూ వెనక్కి తగ్గలేదు. దీంతో పార్టీ 3 వ మహా సభల్లో తీవ్ర ఉత్కంఠత నెలకొంది. చివరి వరకూ పార్టీ నేతలందరూ ఎంతో ఉత్కంఠతతో ఎదురుచూశారు. అయినా సరే…. ఇద్దరు నేతలూ వెనక్కి తగ్గకపోవడంతో చివరికి ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్ లో మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావుకు అత్యధిక ఓట్లు వచ్చాయి. కూనంనేనికి 59 ఓట్లు పడగా, వెంకట్ రెడ్డికి 45 ఓట్లు వచ్చాయి. దీంతో కూనంనేని విజయం సాధించినట్లు మహా సభల వేదికగా ప్రకటించారు. కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతం పార్టీ సహాయ కార్యదర్శిగా కొనసాగుతున్నారు.

 

పార్టీ నియమావళి ప్రకారం ఓ వ్యక్తి 3 సార్లు పార్టీ కార్యదర్శిగా కొనసాగవచ్చు. అయితే… ప్రస్తుతం కార్యదర్శిగా వున్న చాడ వెంకట్ రెడ్డి 2 సార్ల టర్మ్ పూర్తి అయ్యింది. మూడో సారి కూడా బరిలోకి దిగుతానని ప్రకటించారు. అయితే… ఈ సమయంలోనే సరిగ్గా కూనంనేని ఎంటర్ అయ్యారు. ఈ సారి తనకు పదవి కావాలని పట్టుబట్టారు. దీంతో పార్టీ సందిగ్ధంలో పడిపోయింది. ఒకవేళ తనకు మరోసారి ఛాన్స్ ఇవ్వకుంటే పల్లా వెంకట్ రెడ్డికి ఇవ్వాలని చాడ పట్టుబట్టారు. కూనంనేని మాత్రం పట్టువీడలేదు. చివరికి ఓటింగ్ నిర్వహించారు. కూనంనేనికి అధిక ఓట్లు వచ్చాయి. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు.