కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి జ్వరంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో బిజీ వల్ల అలసిపోయిన ఆయనకు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. 63 ఏళ్ల కుమారస్వామి బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయినట్లు ఆయన కార్యాలయం తెలిపింది. జ్వరం, అలసట, సాధారణ బలహీనత వంటి లక్షణాలు ఉన్నట్లు పేర్కొంది. డాక్టర్ సత్యనారాయణ నేతృత్వంలో కుమారస్వామికి సంబంధిత వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారని, ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, కోలుకుంటున్నారని వెల్లడించింది. డాక్టర్ల సలహా మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారని, ఆ తర్వాత ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తారని తెలిపింది. కుమారస్వామి ఆరోగ్యంపై పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందవద్దని ఆయన కార్యాలయం పేర్కొంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.