కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో తెలంగాణ మున్సిపల్ మంత్రి కె. తారక రామారావు కేంద్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. తెలంగాణలోని పట్టణాల అభివృద్ధి కోసం రానున్న కేంద్ర బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించాలని రాష్ట్ర మరోసారి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని ఇతర పట్టణాల అభివృద్ధికి సహకరించాలని ఇప్పటికే అనేకసార్లు కోరామని, ప్రతిపాదనలు పంపిన ప్రతిసారి తమకు నిరాశే ఎదురవుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. పట్టణాల అభివృద్ధికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తున్న కృషికి తోడ్పాటు అందించేందుకు 2023-24 బడ్జెట్‌లో అయినా తగినన్ని నిధులు కేటాయించాలని విన్నవించారు. ఫిబ్రవరి 1న పార్లమెంటులో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మున్సిపల్‌ శాఖకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలంటూ కేంద్రానికి మంత్రి కేటీఆర్‌ ఆదివారం లేఖ రాశారు. హైదరాబాద్‌, వరంగల్‌, ఇతర పురపాలికల కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని, లేదంటే హైదరాబాద్‌, వరంగల్‌ లాంటి పట్టణాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరారు.

లంగాణ రాష్ట్రంపై వివక్షతోనే కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు అదనంగా ఒక రూపాయి కూడా ఇవ్వలేదని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొండిచెయ్యి చూపినా రాష్ట్రంలో పురపాలికలతోపాటు అన్ని రంగాలు అద్భుత ప్రగతి సాగిస్తున్నాయని తెలిపారు. ఎంతో ముందుచూపు, దూరదృష్టితో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకొచ్చిన పాలనా సంసరణలు, విప్లవాత్మక కార్యక్రమాలతో పట్టణాలు సమగ్రాభివృద్ధి సాధిస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అవార్డులు, రివార్డులే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు.