మెట్రో రైల్ విషయంలో మంత్రి కేటీఆర్, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క మధ్య వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ సమయంలోనే మెట్రో ట్రైన్ వచ్చిందని, మెట్రో ఛార్జీలు అగ్రిమెంట్ కి విరుద్ధంగా పెంచారని, దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మెట్రో లిమిటెడ్ కి లాభం చేకూర్చేలా ప్రభుత్వ నిర్ణయాలు వున్నాయని, మెట్రో యాడ్స్ విషయంలో ప్రతిపక్ష పార్టీలకు స్పేస్ ఇవ్వడం లేదని విరుచుకుపడ్డారు.
అయితే.. దీనిపై మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. మెట్రోను పూర్తి చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. మెట్రో రైలుకు కేంద్రం నుంచి ఒక్క పైసా కూడా రాలేదని, బీజేపీ అధికారంలో వున్న రాష్ట్రాలకే నిధులు కేటాయిస్తోందని ఆరోపించారు. కేంద్రానికి నివేదికలు ఇచ్చినా ప్రయోజనం లేదని విరుచుకుపడ్డారు. అమీర్‌పేట మెట్రో స్టేషన్ ఎంత కిక్కిరిసిపోతుందో అందరికీ తెలుసన్నారు. 80 శాతానికిపైగా తెలంగాణ పిల్లలే పని చేస్తున్నారని వెల్లడించారు. మెట్రో ధరలు ఇష్టంవచ్చినట్లు పెంచితే ఊరుకోబోమని చెప్పారు. ఆర్టీసీతో సమానంగా ధరలు ఉండాలని మెట్రో అధికారులకు సూచించామని వెల్లడించారు. రూ.6250 కోట్లతో ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు శ్రీకారం చుట్టామన్నారు. శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రోను మూడేండ్లలో పూర్తిచేస్తామన్నారు.

55 ఏళ్ల అధికారంలో ఉన్న కాంగ్రెస్ చేసిందేమిలేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. 9నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 9 నెలల్లో పిల్లలు పుడతారు కానీ కాంగ్రెస్ అధికారంలోకి రావడం కష్టమన్నారు.దేశంలోనే హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని.. దేశానికి నగరం ఎకానమిక్ ఇంజిన్ గా మారిందన్నారు. ఇటువంటి నగరానికి చేయూతనివ్వాల్సిన కేంద్రం మొండిచెయి ఇస్తుందన్నారు.