మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. తంగళ్లపల్లి మండలంలోని చీర్లవంచలో సబ్‌స్టేషన్ ప్రారంభించారు, ఎస్సీ కమ్యూనిటీ హాల్, ముదిరాజ్ సంఘ భవన్‌కు శంకుస్థాపన చేశారు. గ్రామంలో అంబేద్కర్, చాకలి ఐలమ్మ విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… 350 ఎకరాలలో ఆక్వా హబ్ ఏర్పాటు చేయనున్నామని, అందులో స్థానిక పిల్లలకే ఉద్యోగావకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.
చీర్లవంచకు త్వరలో ఒక పీహెచ్‌సీని తీసుకొస్తామని, గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో టీచర్ల కొరత లేకుండా చూస్తామని వెల్లడించారు. ఇండ్లు లేని ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇప్పించే బాధ్యత తనదని చెప్పారు. రోడ్ల అభివృద్ధికి రూ.10 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. గృహలక్ష్మి పథకం కింద అర్హులకు రూ.3 లక్షల సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమాలు తీసుకురావాలనే కల్పన కేవలం కేసీఆర్ లాంటి నాయకుడితోనే సాధ్యమవుతుందని చెప్పుకొచ్చారు.
దళిత బంధు లాంటి పథకాలు అమలు కావాలంటే నాయకుడికి గుండె నిండా ధైర్యం ఉండాలన్నారు. ఊకదంపుడు ఉపన్యాసాలతో ఐదేండ్లు టైం పాస్ చేసిన సీఎంలు చాలా మంది ఉన్నారని తెలిపారు. కానీ కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధుతో వ్యాపారాలు పెట్టి, లాభాలు పొందుతున్నామని లబ్ధిదారులు చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 40 వేల కుటుంబాలకు లబ్ధి జరిగిందని తెలిపారు.
భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి గ్రామంలో వైకుంఠధామం ఏర్పాటు చేసుకున్నాం అని కేటీఆర్ గుర్తు చేశారు. డంపింగ్ యార్డు, నర్సరీ, ట్రాక్టర్ ట్రాలీ, పల్లె ప్రకృతి వనం, తెలంగాణ క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసుకున్నామని పేర్కొన్నారు. ఇలాంటి పథకాలు దేశంలోని ఇతర గ్రామాల్లో లేవని, ఈ తీరుగా పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. దేశంలో ఉత్తమ గ్రామపంచాయతీలు తెలంగాణలోనే ఉన్నాయని కేంద్రం ప్రకటించింది. ఇలాంటి పనులు చేయడం వల్లే అవార్డులు వస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు.