కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారుపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. జైపూర్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టును అదానీ గ్రూప్‌నకు బదిలీ చేసిన కేంద్రం.. దానిపై ఎలాంటి జీఎస్టీ విధించకపోవడంపై మంత్రి స్పందించారు. ఈ మేరకు ట్విటర్‌లో ఓ పోస్ట్ చేశారు. ‘దేశంలో సామాన్య ప్రజలకు పాలు, పెరుగు లాంటి నిత్యావసరాలపై కూడా జీఎస్టీ విధిస్తారు. కానీ, అదానీ లాంటి అసామాన్యులు ఏకంగా ఎయిర్‌పోర్టులు పొందినా ఎలాంటి జీఎస్టీ ఉండదు’ అని మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘ఇలా మిత్రులకు ఇవ్వడం ఉచితం కాదట.. ప్రధానికి కృతజ్ఞతలు’ అని ఆయన వ్యంగ్యంగా రాశారు. కేంద్రం ప్రభుత్వం చెప్పుకుంటున్నట్టుగా ఇది అమృత కాలం కాదని, మిత్ర్‌ కాలమని (దోస్తుల కాలమని) మంత్రి కేటీఆర్ విమర్శించారు.