బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ని పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన్ను వరంగల్ వైపు పోలీసులు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో అధికార బీఆర్ఎస్, బీజేపీ మధ్య తీవ్ర మాటల యుద్ధం నడుస్తోంది. బండి సంజయ్ అరెస్ట్ పై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ చెలగాటం ఆడుతోందని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు.

”పిచ్చోని చేతిలో రాయి వుంటే.. వచ్చి పోయేటోళ్లకే ప్రమాదం…
కానీ అదే పిచ్చోని చేతిలో ఒక పార్టీ వుంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం.
తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రశ్నాపత్రాలు లీకు చేసిన అమాయకులైన విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న బీజేపీ నాయకులు” అంటూ మంత్రి కేటీఆర్ తీవ్రంగా విరుచుకుపడ్డారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని మంగళవారం అర్ధరాత్రి 12 గంటలకు పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పకుండా, ఎలాంటి వారెంట్ కూడా లేకుండానే బలవంతంగా అదుపులోకి తీసుకున్నాయి. అసలు ఏ విషయంలో అరెస్ట్ చేస్తున్నారని బండి సంజయ్ పోలీసు అధికారులను అడిగినా…. పోలీసులు జవాబు చెప్పలేదు. సంజయ్ అత్తమ్మ చనిపోయి బుధవారానికి 9వ రోజు కావడంతో.. ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇంటికి చేరుకున్న కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది.